ఆంధ్రప్రదేశ్‌లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన, ఉద్యోగాల సృష్టే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని తెలిపారు.
గత 16 నెలల్లో ఏపీలో $120 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించామని, ఇవి కేవలం ఎంఓయూలు కాకుండా అమల్లో ఉన్న ప్రాజెక్టులేనని చెప్పారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ వంటి సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు.
రాష్ట్రం “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో ముందుకు వెళ్తోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని తెలిపారు. “ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ — నాయుడు, మోడీ నేతృత్వంలోని నమో ప్రభుత్వం ఉందని” లోకేష్ పేర్కొన్నారు.
విశాఖలో నవంబర్ 14–15 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2025లో 45 దేశాల నుండి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు పాల్గొననున్నాయని చెప్పారు. సదస్సు సందర్భంగా రూ. 2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు.
రాష్ట్రాన్ని 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.



