తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా బలంగా పనిచేయాలి” అని లోకేష్ సూచించారు. అన్ని పార్టీ, నామినేటెడ్ పదవులను నెలాఖరులోగా భర్తీ చేస్తామని తెలిపారు.
జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో సమన్వయంతో పనిచేయాలని, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాద బీమా చెక్కులు సమయానికి అందేలా చూడాలని, పార్టీ డైరెక్షన్ ప్రకారం ప్రతి నాయకుడు పనిచేయాలని ఆదేశించారు.


