పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని క్రిస్టియన్‌పాలెంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు భారీ ‘కార్డన్ అండ్ సెర్చ్’ (తనిఖీలు) నిర్వహించారు. డీఎస్పీ ఎం. హనుమంతరావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు మారణాయుధాలు (కత్తులు, గొడ్డళ్లు) పట్టుబడటం కలకలం రేపింది. రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేసి, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానిత వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఆపరేషన్‌తో క్రిస్టియన్‌పాలెం ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
