శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ మేరకు స్పష్టతనిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
అయ్యప్ప భక్తులు తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇకపై విమాన ప్రయాణంలో చేతి సామానుగా (Hand Baggage) క్యాబిన్లో తమతో పాటు తీసుకెళ్లవచ్చు.
ఇప్పటివరకు భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడంతో భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ, భద్రతా సంస్థలతో సమీక్షించి ఈ మినహాయింపును అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు.ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చి, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.
భక్తులందరూ విమానాశ్రయ భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి, తనిఖీ ప్రక్రియలకు అనుసరించి, పవిత్రతకు భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు.
భక్తుల దీక్ష, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయంపై అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
