దండకారణ్యంలో దంతెవాడ జిల్లా గీదం బ్లాక్ పరిధిలోని కౌర్గావ్ వాసులు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండటానికి తమ సొంత ఖర్చులతో, శ్రమదానంతో తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు.
కౌర్గావ్ మీదుగా ప్రవహిస్తున్న నదిపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంతో సహా అన్ని సీజన్లలో పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. రహదారుల వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులు, ప్రజాప్రతినిధులను పదేపదే అభ్యర్థించినా ఎవరూ స్పందించలేదు.
దీంతో స్థానిక ఆదివాసీ ప్రజలు వెదురు, స్తంభాలు, కంకర రాళ్ల సాయంతో పిల్లర్లు వేసి, వాటిని అనుసంధానం చేస్తూ తాత్కాలిక వంతెన (బల్లకట్టు) నిర్మించుకున్నారు.వంతెన నిర్మాణం పూర్తవడంతో ఆ ప్రాంతానికి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తమ కష్టం వల్లే సమస్య పరిష్కారమైందని ఆదివాసీ ప్రతినిధులు తెలిపారు.
