బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయాలని ఆయన సూచించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.బేగూసరాయ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, “అనుమానాస్పదంగా కనిపించే బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేస్తాం. ఇది బీహార్.. పాకిస్థాన్ కాదు. ఇక్కడ షరియా చట్టం అమలు కాని స్థలం” అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించాయి.
గతంలోనూ గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పలు సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రస్తుత వ్యాఖ్యలతో మరోసారి బీహార్ రాజకీయాల్లో వేడి చర్చ మొదలైంది.

