మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు కారణమయ్యారు. భోపాల్‌లోని అంబేద్కర్ మైదానంలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “ఒక బ్రాహ్మణుడు తన కూతురిని నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసే వరకు లేదా సంబంధాన్ని అంగీకరించే వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు ‘షోకాజ్’ నోటీసు జారీ చేసింది. ఇండోర్‌కు చెందిన న్యాయవాది శైలేంద్ర ద్వివేది జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంతోష్ వర్మ వాడిన భాష అత్యంత అశ్లీలంగా, మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. గతంలో సంతోష్ వర్మ తన ప్రమోషన్ కోసం కోర్టు ఉత్తర్వులను ఫోర్జరీ చేసిన కేసులో అరెస్టయ్యారు. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఇటువంటి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
