ఒడిశాలోని కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో కీలక మావోయిస్ట్ నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే కూడా ఉన్నారు.

మావోయిస్టుల సంచారంపై అందిన సమాచారంతో CRPF, ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. మరణించిన వారిలో తెలంగాణకు చెందిన గణేష్ ఉయికే (69) ఉన్నారు. ఆయనపై రూ. 1.10 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బారి అలియాస్ రాకేష్, అమృత్ అనే మరో ఇద్దరు మావోయిస్టులు కూడా మరణించారు. వీరందరిపై కలిపి రూ. 23.65 లక్షల రివార్డు ఉంది. గురువారం ఉదయం ఒక మహిళా క్యాడర్ మృతదేహం కూడా లభ్యమైంది.

ఘటనా స్థలం నుండి ఒక రివాల్వర్, 303 రైఫిల్ మరియు వాకీ-టాకీ సెట్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మల్కాన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు డీజీపీ వైబీ ఖురానియా ముందు లొంగిపోయిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.
