సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు, దేశ అత్యున్నత పురస్కార గ్రహీతలను కూడా వదలడం లేదు. ప్రముఖ లెదర్ టెక్నాలజీ నిపుణుడు, పద్మభూషణ్ గ్రహీత రామస్వామి (77) సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి రూ.57 లక్షలు పోగొట్టుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకున్న దుండగులు.. రామస్వామికి ఫోన్ చేసి ‘పాస్పోర్ట్ మోసం చైనా స్పై కేసులో సంబంధం ఉందని బెదిరించారు. ఐదు రోజుల పాటు ఆయనను నిరంతరం భయపెట్టి ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట ఒత్తిడి తెచ్చారు. విచారణలో భాగంగా డబ్బు బదిలీ చేయాలని నమ్మించి, విడతల వారీగా రూ.57 లక్షలు కాజేశారు. రామస్వామి గతంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మాజీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
మోసపోయానని గ్రహించిన శాస్త్రవేత్త సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుల బ్యాంక్ ఖాతాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అపరిచిత వ్యక్తులు వీడియో కాల్ చేసి ‘డిజిటల్ అరెస్ట్’ అని భయపెడితే నమ్మకండి. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఆన్లైన్లో అరెస్టులు చేయవని గుర్తుంచుకోండి
