కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు గురువారం రాపూరులో నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు విధులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చి తమ నిరసనను గళమెత్తారు. పట్టణంలోని ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించి, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరియు కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్మికులందరూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకొని మానవహారం నిర్వహించారు. కేంద్రం తెచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం మరియు సామాజిక భద్రత కల్పించాలని, గ్యాస్ ధరలను తగ్గించాలని నినదించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
