జిల్లాలో ఉద్యానవన రంగాన్ని వినూత్నంగా అభివృద్ధి చేయాలని, రాష్ట్రమంతా నెల్లూరు వైపు చూసేలా ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో ఉద్యానవన శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.పెన్నా లేదా సంగం బ్యారేజ్ పరిసరాల్లో, లేదా ఇతర అనువైన ప్రాంతంలో 5 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఉద్యానవన నర్సరీ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి మండలం ఒక ప్రత్యేక ఉద్యాన పంటల హబ్‌గా ఎదగాలని, మండలానికి ఒక గుర్తింపు వచ్చేలా అధికారులు పని చేయాలని సూచించారు.సైదాపురం, కలువాయి, దుత్తలూరులోని కోల్డ్ స్టోరేజ్ (శీతల గిడ్డంగి)లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, జిల్లాలో పాలీ హౌస్‌లు, ఫాం పాండ్స్ (పంట కుంటలు) సంఖ్యను పెంచాలని స్పష్టం చేశారు. కేవలం నిర్దేశించిన లక్ష్యాలే కాకుండా, శాస్త్రీయ దృక్పథంతో కొత్తగా ఆలోచించి వినూత్న ఫలితాలు సాధించాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణా రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
