ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వేదికైన మేడారం ఆధ్యాత్మికతతో పాటు అంతర్జాతీయ సాంస్కృతిక వేదికగా మారింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద న్యూజిలాండ్‌కు చెందిన ‘మావోరీ’ తెగ గిరిజనులు సందడి చేశారు.
న్యూజిలాండ్ గిరిజనులు తమ దేశ సాంప్రదాయ యుద్ధ నృత్యమైన ‘హాక’ (Haka) ను ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.మావోరీ గిరిజన బృందంతో కలిసి రాష్ట్ర మంత్రి సీతక్క అడుగులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సంస్కృతిని గౌరవిస్తూ ఆమె వారితో కలిసి నృత్యం చేయడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. అనంతరం ఈ బృందం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని, గిరిజన సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ దేశాల గిరిజన సంస్కృతుల మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలిచింది.
