హైదరాబాద్‌లో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన నవనిర్మాణ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2వ తేదీన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో ‘జనసేన సాధక్’ సమావేశం నిర్వహించాలనుకున్నారు. సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేసిన ఈ సమావేశానికి అనుమతిని తిరస్కరిస్తున్నట్లు సెరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల సమస్యలు, స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సమయంలో సమావేశం నిర్వహించడం సమంజసం కాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహిస్తే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని, నిరసనలు, ఆందోళనలు జరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ పోలీసుల తీరుపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్థరహితమని, రాజకీయ దురుద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ సమావేశాలు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో, కేవలం తమ కార్యక్రమానికే పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సహేతుకం కాదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోవని స్వయంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించింది.

