ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల కోసం మహిళా సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు
మానేసర్‌లో తొలి కోర్సు
భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మహిళల కార్యాచరణ సామర్థ్యాలను పెంచే దిశగా జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) కీలక ముందడుగు వేసింది.
తొలిసారిగా వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) మహిళా సిబ్బంది కోసం ‘మహిళా కమాండో కన్వర్షన్ కోర్సు’ (ఎంసీసీసీ)ను ప్రారంభించింది.
హర్యానాలోని మానేసర్‌లో ఉన్న ఎన్ఎస్‌జీ శిక్షణా అకాడమీలో ఈ కోర్సు మొదలైంది.
12 వారాల పాటు కఠినమైన శిక్షణ
నారీశక్తి సాధికారతలో ఇది కొత్త అధ్యాయమని ఎన్ఎస్‌జీ పేర్కొంది.
‘సాహసవంతులే నాయకత్వం వహిస్తారు’ (She Who Dares, Leads) అనే నినాదంతో ఈ కోర్సును రూపొందించింది.
12 వారాల పాటు సాగే ఈ శిక్షణలో మహిళా సిబ్బందికి శారీరక, సాంకేతిక, పోరాట నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు.
ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో కీలక బాధ్యతలు చేపట్టేలా వారిని సిద్ధం చేయనున్నారు.
అధునాతన ఆయుధాల వినియోగంపై శిక్షణ
కఠినమైన శారీరక దారుఢ్య శిక్షణతో పాటు అధునాతన ఆయుధాల వినియోగం, మార్క్‌స్‌మన్‌షిప్, వ్యూహాత్మక దాడులు, బందీల విముక్తి వంటి అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు.
ఈ శిక్షణ వ్యక్తిగత నైపుణ్యాలను పెంచడంతో పాటు వివిధ భద్రతా దళాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఎన్ఎస్‌జీ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక సామర్థ్యానికి బలం
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సిబ్బంది తమ మాతృ సంస్థలకు తిరిగి వెళ్తారు.
అక్కడ వారు పొందిన నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.
సంక్లిష్టమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా మహిళలను సిద్ధం చేయడంలో ఈ కోర్సు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఎన్ఎస్‌జీ పేర్కొంది.
ఈ కార్యక్రమం గురించి ఎన్ఎస్‌జీ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది.



