యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమం విజయవంతంగా 30వ రోజుకు చేరుకుంది. జిల్లా పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు పిలుపు మేరకు నందిగామలో బుధవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గత నెలలో ప్రారంభమైన ఈ ప్రచారంలో భాగంగా ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు సైకిళ్లపై జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ యాత్ర బుధవారం నందిగామకు చేరుకుంది. ఈ ర్యాలీలో పోలీస్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది, రాజకీయ నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేవలం పోలీసులు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ప్రవర్తనను గమనిస్తూ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని అధికారులు కోరారు. ‘డ్రగ్స్ వద్దు – జీవితమే ముద్దు’ వంటి వినూత్న స్లోగన్లతో నందిగామ పురవీధుల్లో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది.డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
