ఓజీ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. ఈ సీక్వెల్ కచ్చితంగా ఉండబోతుందని నటుడి అధికారిక సోషల్ మీడియా బృందం ఒక ప్రకటన ద్వారా ధృవీకరించింది. “మాటిచ్చినట్లుగానే ఆయన చేస్తారు. సమయం ఎప్పుడన్నది ఆయనే మాకు తెలియజేస్తారు. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుంచి రాగానే ఓజీ 2 గురించి చర్చిస్తాం” అని పవన్ కళ్యాణ్ అధికారిక బృందం పేర్కొంది. దీనిపై ఇంకా ఎలాంటి డేట్స్ ప్రకటించనప్పటికీ, తమ అభిమాన హీరో ఓజాస్ గంభీరగా మళ్లీ రానున్నాడన్న కన్ఫర్మేషన్ అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. గతంలో సెప్టెంబర్ 2025లో ‘ఓజీ యూనివర్స్’ గురించి అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ఫ్రాంచైజీకి సీక్వెల్స్, ప్రీక్వెల్ చేయనున్నట్లు అప్పుడే కన్ఫర్మ్ చేశారు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ “ఓజాస్ గంభీర”గా నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ). ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా, 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సాధించిన ఘన విజయం, ఆ పాత్రకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో ‘ఓజీ 2’ ఒకటిగా నిలిచింది.


