కడప జిల్లా ఒంటిమిట్టలో నిర్వహించనున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు మరియు ఏప్రిల్ 1న జరిగే రాములవారి కల్యాణోత్సవం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. గురువారం సాయంత్రం ఒంటిమిట్ట టిటిడి అతిథి గృహంలో టిటిడి జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు.

మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలు, ప్రత్యేక బస్సులు, పార్కింగ్, బ్యారికేడింగ్, అన్నదానం, లైవ్ స్ట్రీమింగ్ వంటి ఏర్పాట్లపై శాఖల వారీగా చర్చించారు.రాములవారి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, రాజంపేట సబ్ కలెక్టర్ భావన తదితర అధికారులు పాల్గొన్నారు.
