పాకిస్థాన్‌లో హిందూ యువతికి ఊరట.. కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి, పెళ్లి!

September 2, 2026 10:15 AM

కిడ్నాప్ చేసి పంజాబ్‌కు తరలింపు

పాకిస్థాన్‌లో 21 ఏళ్ల హిందూ యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన ఘటన కలకలం రేపింది.

అంతటితో ఆగకుండా ఇప్పటికే వివాహమైన ఓ ముస్లిం యువకుడితో ఆమెకు బలవంతంగా పెళ్లి జరిపించినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ కేసులో బాధితురాలికి కోర్టు ఊరట కల్పించింది.

ఆమెను తిరిగి కన్నవారి వద్దకు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..?

సింధ్ ప్రావిన్స్‌లోని సంఘర్ జిల్లా ఖిప్రో తాలుకా రాణా రాజ్‌పుత్ కాలనీకి చెందిన 21 ఏళ్ల శిరిమాతి రీటా గత వారం అదృశ్యమైంది.

తన చెల్లెలు కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు శంకర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా రీటాను కొందరు వ్యక్తులు బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిన విషయం బయటపడింది.

ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నట్లు ఫుటేజీలో కనిపించింది.

కిడ్నాపర్లు రీటాను సింధ్ నుంచి పంజాబ్ ప్రావిన్స్‌లోని గుర్జాన్‌వాలాకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

అక్కడ ఆమెపై ఒత్తిడి తెచ్చి ఇస్లాంలోకి బలవంతంగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అనంతరం అప్పటికే వివాహమై భార్య ఉన్న నజీర్ హుస్సేన్ అనే ముస్లిం యువకుడితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల దర్యాప్తుతో రీటాకు రక్షణ

సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

నిందితుల స్థావరాన్ని గుర్తించి రీటాను సురక్షితంగా రక్షించారు.

అనంతరం సోమవారం ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

కోర్టు రీటా వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వెంటనే ఆమెను కన్నవారి వద్దకు అప్పగించాలని పోలీసులను ఆదేశించారు.

దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రీటా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మైనారిటీల భద్రతపై ఆందోళన

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన యువతులు, మహిళలపై జరుగుతున్న ఘటనలపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీపీ) నివేదికలు, అంచనాల ప్రకారం.. ఆ దేశంలో ప్రతి సంవత్సరం మైనారిటీ వర్గాలకు చెందిన వందలాది మంది చిన్న వయసు యువతులు, మహిళలు అపహరణకు గురవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

వారిని నిర్బంధించి బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఆ తర్వాత ముస్లిం వ్యక్తులతో వివాహాలు జరిపించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media