Palasaలో ‘గన్ కల్చర్’: మున్సిపల్ వైస్ చైర్మన్‌ సహా ముగ్గురు అరెస్ట్

January 12, 2026 10:05 AM

శ్రీకాకుళం జిల్లాలో నేరాలకు కేంద్రబిందువుగా ఉన్న పలాసలో మరోసారి గన్ కల్చర్ అలజడి రేపింది. రైల్వే పార్కింగ్ టెండర్ వివాదంలో ప్రత్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ (వైసీపీ నాయకుడు) మీసాల సురేష్ బాబుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీబుగ్గ డి.ఎస్.పి. షేక్ సహబాజ్ అహ్మద్ ఆదివారం మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.గత 13 ఏళ్లుగా రైల్వే పార్కింగ్ కాంట్రాక్ట్ నడుపుతున్న మీసాల కుటుంబీకులు, ఇటీవల జరిగిన వేలం పాటలో ఒరిస్సాకు చెందిన కణితి జనార్ధనరావు చేతిలో టెండర్ ఓడిపోయారు. టెండర్ అప్పగించే క్రమంలో జనార్ధనరావుపై పాత కాంట్రాక్టర్లు మీసాల సురేష్ బాబు (A1), చిన్నారావు (A2), మోహనరావు (A3) మరియు మున్నా (A4) కలిసి దాడికి దిగారు. A2 చిన్నారావు తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా, మిగిలిన వారు కత్తులు, కర్రలతో దాడి చేశారు.

కోసంగిపురం జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, 4 బుల్లెట్లు, 3 కత్తులు, 2 కర్రలు, 3 సెల్ ఫోన్లు మరియు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. మున్నా అనే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై గతంలోనే 4 నుంచి 8 వరకు హత్యాయత్నం, బెదిరింపుల కేసులు నమోదై ఉన్నాయని డి.ఎస్.పి తెలిపారు. రాజకీయ హోదాలో ఉన్న వ్యక్తులే గన్ కల్చర్‌కు పాల్పడటంతో పలాస వ్యాపార వర్గాల్లో మరియు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media