AP: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకులు బద్దలయ్యేలా స్పీచులు ఇవ్వడం, హామీల వర్షం కురిపించడం ఏ పొలిటికల్ లీడర్‌కైనా చాలా ఈజీ. పవర్‌లోకి వచ్చాక ఆ మాట మీద నిలవడమే అసలు సమస్య. మాట తప్పితే నమ్మి ఓట్లేసిన జనం నుంచి వచ్చే రివర్స్ అటాక్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరిగ్గా ఇలాంటి ఒక పొలిటికల్ ట్రాప్ లో చిక్కుకున్నారా? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. పవన్‌పై వచ్చే సాధారణ రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే.. కర్నూలు సుగాలి పార్వతీదేవి కుమార్తె హత్యాచారం కేసు మాత్రం ఆయన నైతికతను, క్రెడిబిలిటీని నిలదీస్తోంది. నేను రాజకీయ నాయకుల్లా కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడే మొండివాడిని… అని చెప్పుకునే పవన్ ఇమేజ్‌కు ఈ కేసు ఇప్పుడు ఒక అల్టిమేట్ లిట్మస్ టెస్ట్‌గా మారింది. ఈ సంచలన కేసు హిస్టరీ, అప్పట్లో జరిగిన పొలిటికల్ మ్యానేజ్‌మెంట్, ఇప్పుడు పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్న నెగెటివ్ నేరేటివ్ ఏంటి?
2017 ఆగస్టు 19న కర్నూలు శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్కూల్ యాజమాన్యం దీన్ని ఆత్మహత్య అని క్లోజ్ చేయాలని చూసినా.. తన కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని తల్లి సుగాలి పార్వతీదేవి ఆరోపించింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. నాడు అధికారంలో ఉన్న టీడీపీలో బలమైన రాజకీయ అండదండలు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్‌లో పట్టు ఉన్న కె. జనార్ధన్ రెడ్డి, ఆయన కుమారులు ఈ కేసులో ప్రధాన నిందితులు. పొలిటికల్ ప్రెజర్ వల్ల పోలీసులు కేసును నీరుగార్చారనే ఆరోపణలు వచ్చాయి. దానికి తగ్గట్టే, ఘోరం జరిగిన నెల రోజులకు అరెస్ట్ అయిన నిందితులు.. కేవలం 23 రోజుల్లోనే చాలా కూల్‌గా రెగ్యులర్ బెయిల్‌పై బయటకు వచ్చేశారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని క్లియర్ గా తేలడం నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర డిఫెన్స్‌లో పడేసింది.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ కేసులోని సున్నితత్వాన్ని బట్టి విచారణను సీబీఐ కి అప్పగిస్తూ జీవో ఇచ్చారు. మానవీయ కోణంలో బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఇళ్ల స్థలం, తండ్రికి రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. కానీ లీగల్ విచారణలో సీబీఐ కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, కేసు సీబీఐ చేతికి వెళ్లేలోపే.. స్థానిక లూప్‌హోల్స్ ఉపయోగించి కీలకమైన ఫోరెన్సిక్ డీఎన్ఏ శాంపిల్స్, స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజీలు పూర్తిగా మాయం అయిపోయాయి. పక్కా టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడంతో దేశంలోనే టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కోర్టులో నేరాన్ని నిరూపించలేక సైలెంట్ అయిపోయింది.
అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కల్యాణ్ సగాలి ప్రీతి కేసును చేతుల్లోకి తీసుకున్నారు. బాధిత తల్లి కన్నీళ్లు చూసి చలించిపోయిన ఆయన.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చేసే మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైలుపైనే ఉంటుంది.. నిందితుల తోలు తీస్తాం అంటూ ఎలక్షన్ల ముందు ఎమోషనల్ హామీ ఇచ్చారు. జనసేన మేనిఫెస్టోలో మహిళా భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యతకు ఈ కేసే బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవర్‌లోకి వచ్చాక పవన్ టోన్ పూర్తిగా మారింది. ఇటీవల కాకినాడ పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు బాధితులను తీవ్రంగా గాయపరిచాయి:
పవన్ కల్యాణ్ వ్యవస్థలో నేరం జరిగిందని మనకు అనిపించినా.. కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే నడుస్తాయి. సుగాలి ప్రీతి కేసులో అప్పట్లోనే ఫోరెన్సిక్ డీఎన్ఏ ఆధారాలు, రికార్డులు అన్నీ ధ్వంసం చేసేశారు. ఇప్పుడు ఆధారాలు లేనప్పుడు చట్టపరంగా ఏం చేయగలం? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆవేశంగా మాట్లాడి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా న్యాయ సూత్రాలు మాట్లాడటం పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీస్తోంది. నాడు ఓట్ల కోసం హామీ ఇచ్చి.. నేడు నిందితులు మీ మిత్రపక్షమైన టీడీపీకి చెందినవారు కాబట్టే సాక్ష్యాలు లేవని తప్పించుకుంటున్నారా? అంటూ వైసీపీ సోషల్ మీడియా పాత వీడియోలతో జనసేనానిపై దండయాత్ర మొదలుపెట్టింది. అటు బాధిత తల్లి సుగాలి పార్వతి సైతం పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గన్నవరం పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ సీఎంపైనే ఫిర్యాదు చేయడం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
సాక్ష్యాలు లేవు అని చేతులెత్తేస్తే పవన్ కల్యాణ్ లైఫ్ టైమ్ పొలిటికల్ గా డిఫెన్స్‌లో పడిపోతారు. మరి ఈ చుట్టుముట్టిన వివాదం నుంచి బయటపడాలంటే ఆయన ముందున్న ఏకైక మార్గం: రివర్స్ ఇన్వెస్టిగేషన్. అసలు ఆనాడు బాలికపై హత్యాచారం జరిగినప్పుడు ఆధారాలను మాయం చేసిన ఆ అదృశ్య శక్తులు ఎవరు?… నిందితులకు కొమ్ముకాస్తూ పోస్టుమార్టం రిపోర్టులను, డీఎన్ఏ శాంపిల్స్‌ను, సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు, ల్యాబ్ సిబ్బంది ఎవరు?..నేరం చేసిన వారిని పట్టుకోవడం ఎలాగో కష్టమైంది కాబట్టి.. ఆధారాలను ధ్వంసం చేసిన వ్యవస్థలోని అవినీతి తిమింగలాలపై విచారణకు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆదేశించాలి. ఆ అధికారుల లైసెన్సులు రద్దు చేసి, జైలుకు పంపితే.. పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది, అటు డిప్యూటీ సీఎం పవర్ ఏంటో వ్యవస్థకు చూపించినట్టు అవుతుంది. మరి జనసేనాని ఈ రివర్స్ స్ట్రాటజీతో విపక్షాల నోళ్లు మూయిస్తారా.. లేక సైలెంట్‌గా ఉండి పొలిటికల్ మైలేజ్ కోల్పోతారా అనేది చూడాలి.



