ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అరుదైన అంతర్జాతీయ మైలురాయిని చేరుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’ (Kenjutsu) లో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది. మూడు దశాబ్దాలుగా మార్షల్ ఆర్ట్స్‌పై ఆయనకున్న అంకితభావానికి నిదర్శనంగా ఈ చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు లభించింది. జపాన్‌లోని అత్యంత గౌరవనీయమైన ‘టకెడా షింగెన్ క్లాన్’ (Takeda Shingen Clan) లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు.

జపాన్ యుద్ధకళల సంస్థ ‘సోగో బుడో కన్రి కై’ నుంచి ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఫిఫ్త్ డాన్’ గౌరవం దక్కింది. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ పవన్ కళ్యాణ్‌ను “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” బిరుదుతో సత్కరించింది.

ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ ‘కెండో’లో ఉన్నత స్థాయి శిక్షణ పొందారు. ‘తమ్ముడు’, ‘ఖుషి’ వంటి చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించిన పవన్, ఇప్పుడు వాస్తవ జీవితంలోనూ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనంతో ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాలు, రాజకీయాలు మరియు యుద్ధకళలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ వేదికపై భారతదేశ కీర్తిని పవన్ కళ్యాణ్ చాటిచెప్పారు.
