తన నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతిపై తన విజన్‌ను వివరించారు.

గతేడాది పిఠాపురంలో రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ ఏడాది అదనంగా రూ. 211 కోట్లతో మరిన్ని పనులు చేస్తున్నామని పవన్ తెలిపారు. “నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి రాలేదు సినిమాల్లో నేను బాగానే సంపాదించుకోగలను. వ్యవస్థను బలోపేతం చేయడమే నా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. పిఠాపురంలో కాకి ఈక ఊడిపడినా ఏదో జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఏదైనా కూలగొట్టడం సులభమని, కానీ ఒక కూటమిని నిర్మించి అందరినీ ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలకు ఆంధ్రా ప్రాంత ప్రేమను పంచాలని, మన సోదర సోదరీమణులను సంక్రాంతి వేడుకలకు ఆహ్వానించి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని కోరారు.మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, కందుల దుర్గేష్‌లతో కలిసి ఆయన స్టాళ్లను సందర్శించి ఉత్సవాలను ప్రారంభించారు.

