రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. సినిమా టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోం శాఖ అధికారికంగా జీవో (నెం. 7973) జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్‌పై అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌లలో ప్రతి టికెట్‌పై రూ. 125 (జీఎస్‌టీతో కలిపి) పెంచుకోవచ్చు. ఈ పది రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాత ధరలు తిరిగి సాధారణ స్థాయికి వస్తాయి. రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. జూన్ 3న ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్‌టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపునకు జీవో ఇచ్చింది. ఈ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఫిల్మ్ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

