ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం శనివారం అత్యంత వేడుకగా జరిగింది.
శనివారం వేకువజామున 4 గంటలకు స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం వేళ శ్రీవార్లకు తీరుచ్చి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం మరియు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
