వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిల కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేసే క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పిన్నెల్లి సోదరులను మూడవసారి ఒక్కరోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులను, మాచర్ల రూరల్ పోలీసులు అక్కడే విచారించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ కస్టడీ విచారణ జరగనుంది.గుండ్లపాడులో జరిగిన టీడీపీ కార్యకర్తల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. విచారణలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ఈ కస్టడీని కోరారు.జైలు అధికారుల సమక్షంలోనే పోలీసుల విచారణ కొనసాగనుంది. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.
