తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యంలో ఉన్న ఆ రాష్ట్రంలో నటుడు విజయ్‌కి చెందిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనూహ్యమైన ఆధిక్యం సాధించింది. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఈ పార్టీ తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) గతంలో చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 2025లో మహాబలిపురంలో జరిగిన TVK తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “చెన్నై సూపర్ కింగ్స్‌ను గెలిపించే ధోనీతో నేను పోటీ పడాలి. అతను రాష్ట్రంలో నా కంటే ఎక్కువ జనాదరణ పొందిన ఏకైక బీహారీ. కానీ వచ్చే ఏడాది నేను మీ పార్టీ (TVK) గెలుపుకు సహాయం చేసి, జనాదరణలో ధోనీని అధిగమిస్తాను” అని నవ్వుతూ చెప్పారు.
అప్పట్లో అది సాధారణ రాజకీయ వ్యాఖ్యగా కొట్టిపారేసినప్పటికీ, కిషోర్ అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. తమిళనాడులోని పాత రెండు పార్టీల వ్యవస్థతో విసిగిపోయిన ఓటర్లు కనీసం 15 నుంచి 20 శాతం ఉన్నారని, సరైన ప్రత్యామ్నాయం కోసం వారు ఎదురుచూస్తున్నారని ఆయన ముందే TVK నేతలకు చెప్పారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేలా పార్టీకి ఒక రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది TVK. ముఖ్యంగా పట్టణాల్లోని యువ ఓటర్ల మద్దతుతో DMK సాంప్రదాయ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టింది. కిషోర్ 2025 జులైలోనే తన పార్టీ కార్యకలాపాల కోసం TVK ప్రత్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయన రూపొందించిన ప్రారంభ వ్యూహాలు పార్టీకి బలమైన పునాది వేశాయి. చాలా మంది రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ TVK అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
