పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించి, సత్యసాయి బాబా సేవా సిద్ధాంతాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ రూ.100 విలువైన స్మారక నాణెం, అలాగే శ్రీ సత్యసాయి స్మారక తపాలా బిళ్లలను సీఎం చంద్రబాబుతో కలిసి విడుదల చేశారు.
శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం మా అదృష్టం, ఓ వరం. ప్రేమ, సేవ, దయ అనే సూత్రాలతో బాబా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేశారు. “వసుధైవ కుటుంబకం” అనే భావనతో ఆయన జీవితం సాగింది.
సేవ, భక్తి, జ్ఞానం — ఇవే భారతీయ జీవన విధానాలు. వీటినే బాబా బోధించారు. “లవ్ ఆల్ – సర్వ్ ఆల్” అనే సందేశాన్ని బాబా మాత్రమే కాక ఆయన సంస్థలు కూడా కొనసాగిస్తున్నాయి. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన సంస్థలు గ్రామీణాభివృద్ధి, వైద్యం, విద్య రంగాల్లో సమాజానికి విశేష సేవలు అందిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు వచ్చినా, సత్యసాయి సేవాదళ్ ముందుండి సహాయం చేస్తోంది. భుజ్ భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు మరపురానివి. 3 వేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపులను ఏర్పాటు చేసి లక్షల మందికి నీరు అందించడంలో బాబా సంస్థ కీలక పాత్ర పోషించింది.సత్యసాయి సంస్థలు ఉచిత వైద్య సేవలను అందిస్తూ మానవతకు కొత్త ప్రమాణాలు ఏర్పరుస్తున్నాయి.

సుకన్య సమృద్ధి యోజన
వేలాది బాలికలకు సత్యసాయి ట్రస్ట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దేశంలో ఇప్పటికే 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు రూ.3.25 లక్షల కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. వారణాసిలోనే 27 వేల బాలికలకు ఈ పథకం కింద నిధులు జమ చేసిన అనుభవాన్ని మోదీ స్మరించారు.
గిర్ ఆవుల పంపిణీపై ప్రధాని
శ్రీసత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదవారికి గిర్ జాతి ఆవులను అందజేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా వారణాసిలో 480కి పైగా గిర్ ఆవులను అందించారని తెలిపారు. రువాండాలో కూడా 200కు పైగా గిర్ ఆవులు ఉండటం, గోవుల దానం సంప్రదాయం అక్కడ విస్తరించటం ప్రస్తావించారు.
వీటి ద్వారా పాల ఉత్పత్తి, పోషకాహారం, సామూహిక ఆరోగ్య రక్షణ వంటి అంశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతుందని మోదీ అన్నారు. “వోకల్ ఫర్ లోకల్” మంత్రాన్ని అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. సత్యసాయి బాబా ప్రేరణతో కరుణ, శాంతి, కర్మ విలువలను జీవితంలో ఆచరించాలని ఆశాజనకంగా చెప్పారు.



