కిరాతక భర్త.. నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి హత్య

September 3, 2026 12:28 PM

అడ్డువచ్చిన అత్తపైనా కత్తితో దాడి.. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న భార్యపై కక్ష పెంచుకున్న ఓ భర్త.. నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

భార్యను కాపాడేందుకు అడ్డువచ్చిన అత్తపైనా కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటన ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో జరిగింది.

పదేళ్ల క్రితం వివాహం

పదిర గ్రామానికి చెందిన జ్యోతికి ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు కుమారులు సిద్దు, బన్నీ, కుమార్తె దీక్ష ఉన్నారు. కొంతకాలంగా బంగారం, వెండి అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ సురేష్.. జ్యోతితో గొడవపడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

గతంలోనూ జ్యోతిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు వారు ఆరోపించారు.

భర్త వేధింపులు భరించలేక జ్యోతి ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లి ఎల్లవ్వ వద్ద ఉంటోంది.

అయితే జ్యోతి తన మాట వినడం లేదన్న కక్షతో సురేష్ ఆమెపై ఆగ్రహం పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కారులో కాపుకాసి.. కత్తితో దాడి

జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న విషయం సురేష్‌కు తెలిసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో అతడు పదిర గ్రామ శివారులో కారులో కాపుకాసినట్లు తెలుస్తోంది.

రాత్రి సమయంలో జ్యోతి, ఎల్లవ్వ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా సురేష్ కారులో అక్కడికి వచ్చాడు.

వెంట తెచ్చుకున్న కత్తితో జ్యోతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురిని కాపాడేందుకు ఎల్లవ్వ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపైనా కత్తితో దాడి చేశాడు.

జ్యోతి పొట్ట, ఛాతి, చేతులపై తీవ్రంగా కత్తిపోట్లు పడటంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది.

ఎల్లవ్వ కాలు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

కారులో పారిపోయేందుకు యత్నం

తల్లీకూతుళ్ల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో సురేష్ కారులో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

స్థానికులు బండరాళ్లతో కారును అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు తప్పించుకుని పారిపోయాడు.

ఆ తర్వాత సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎల్లవ్వకు తీవ్ర గాయాలు

తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను తొలుత సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media