విదేశాల్లో మంచి ఉద్యోగాలంటూ వెళ్లి మయన్మార్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న 27 మంది తెలుగు యువకులు ఎట్టకేలకు క్షేమంగా భారతదేశానికి చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచి, విదేశాంగ శాఖతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఏపీ, తెలంగాణకు చెందిన 27 మంది యువకులు భారీ జీతాల ఆశతో మయన్మార్ వెళ్లారు. అయితే అక్కడ వారిని బలవంతంగా సైబర్ స్కామ్‌లకు పాల్పడాలని వేధించడమే కాకుండా, శారీరక హింసకు గురిచేశారు. తమ దీనస్థితిని వివరిస్తూ బాధితులు మంత్రి రామ్మోహన్ నాయుడుకు వీడియో సందేశం పంపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా చేతిలో చిక్కుకున్నామని తమను కాపాడాలని వేడుకున్నారు. వీడియో చూసి చలించిన మంత్రి, వెంటనే విదేశాంగ మంత్రి డా. జైశంకర్‌కు లేఖ రాశారు. యాంగోన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకున్నారు.

ప్రభుత్వ చర్యల ఫలితంగా శనివారం ఉదయం బాధితులంతా ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తమను మృత్యుముఖం నుంచి రక్షించి, తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు బాధితులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన వీరందరికీ ఢిల్లీలోనే అవసరమైన వసతులు కల్పించారు.
