చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై వైసీపీ విమర్శలు..
Rayalaseema : Rayalaseema ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త పోరాట కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం వివిధ జిల్లాల అధ్యక్షులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పార్టీ తరపున ఎత్తిపోతల పథకం సాకారం చేసేందుకు ఉద్యమించాలని నిర్ణయించారు. రాయలసీమ జిల్లాలు మొదట నుంచీ వైసీపీ కి అండగా నిలుస్తుంటాయి. అక్కడ ఇటీవల కాలంలో తెలుగుదేశం జోరు పెంచింది. పూర్వ వైభవం తెచ్చుకొనేందుకు ఉద్యమాన్ని నిర్మించాలని వైసీపీ తలపోస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తానే సీమ ఎత్తిపోతలకు బ్రేక్ వేశానని సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగా ప్రకటించినా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదపకపోవడంపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
Rayalaseema పథకం సాధనే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణకు నిర్ణయం:
చంద్రబాబు మన రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని, రేవంత్ రెడ్డి మాటలకు కట్టుబడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే 75 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ అంశంపై ప్రజల్లో చర్చ మొదలైనప్పుడల్లా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ తెస్తున్నారని ధ్వజమెత్తారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలుగుదేశానికి ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తో స్నేహపూర్వక సంబంధాలు కోరుకొంటోంది.
దీంతో గట్టిగా పట్టు పట్టలేని పరిస్థితి. ఇదే సమయంలో రాయలసీమ రైతాంగం తరపున వైసీపీ పోరుబాట పడితే, అది పార్టీకి, కార్యకర్తలకు చాలా ఉపయోగకరం. అందుచేత ఈ విషయంలో ఉద్యమాన్ని నిర్మించాలని వైసీపీ తలపోస్తోంది.



