బాపట్లకు చెందిన బ్యూటీషియన్ మానసపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. గుంటూరు GGHలో చికిత్స పొందుతున్న మానసను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించారు. ఒక ఫంక్షన్‌లో బంగారం మాయమైందన్న ఫిర్యాదుతో పోలీసులు మానసను అనుమానించి డిసెంబర్ 26న స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ ఆమెపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది.

విచారణ పేరుతో మహిళను ఇన్నిసార్లు స్టేషన్‌కు పిలిచి వేధించడంపై రాయపాటి శైలజ పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని, ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఆమె స్పష్టం చేశారు.

