బీసీసీఐ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికను అకస్మాత్తుగా ఎందుకు మార్చాల్సి వచ్చిందనే దానిపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫైనల్ బెంగళూరులో నిర్వహించాల్సి ఉండగా.. ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి కొందరు రాజకీయ నాయకులు బీసీసీఐ ముందు ‘అంగీకరించలేని డిమాండ్లను’ ఉంచినట్లు ఈ నివేదిక పేర్కొంది. రాజకీయ నాయకుల నుండి వచ్చిన ఈ విపరీతమైన ఒత్తిళ్లు, కోరికలకు తలొగ్గడం ఇష్టం లేకనే, బీసీసీఐ ఫైనల్ మ్యాచ్‌ను ముందుగా నిర్ణయించిన వేదిక నుండి వేరొక చోటికి తరలించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.
ఫైనల్ కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఇందులో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడతాయి. అనంతరం మే 27న న్యూ చండీగఢ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మూడు, నాలుగు స్థానాల్లోని జట్లు పోటీపడతాయి. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మధ్య జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ కూడా మే 29న ఇదే వేదికపై నిర్వహిస్తారు.
సాధారణంగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత సీజన్ విజేత హోమ్ గ్రౌండ్లో ఫైనల్ జరుగుతుంది. ఈ లెక్కన గత ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కావడంతో ఫైనల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా బీసీసీఐ ఈ వేదికను అహ్మదాబాద్‌కు మార్చింది. స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థనలు, నిబంధనలు బీసీసీఐ నిర్దేశించిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌కు అతీతంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేదికను మార్చాల్సి వచ్చిందని బీసీసీఐ స్పష్టం చేసింది. స్థానిక అధికారులు మరియు భాగస్వామ్య పక్షాల (స్టేక్ హోల్డర్ల) నుండి వచ్చిన వరుస వివాదాస్పద డిమాండ్లు, నిర్వహణపరమైన ఆందోళనల కారణంగా మే 31న జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే హక్కును బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం కోల్పోయింది. ఐపీఎల్ (IPL) అధికారులు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయితే, సంఘం సభ్యులు, రాజకీయ నాయకులకు ఉచిత పాస్‌లు ఇవ్వాలనే అభ్యర్థనలతో సహా వారి డిమాండ్లు మరీ శృతిమించి, అంగీకరించలేని స్థాయిలో ఉండటంతో ఇరువర్గాల మధ్య చర్చలు విఫలమయ్యాయి.
