రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేసి, అధికారులతో కలిసి పలు వార్డుల్లో సమస్యలను పరిశీలించారు.
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.7.10 కోట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఇందులో డ్రైనేజీల నిర్మాణానికి రూ.2 కోట్లు, సిమెంటు రోడ్ల నిర్మాణానికి రూ.5.10 కోట్లు ఉన్నాయి.
రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, అన్ని వార్డుల్లో ఈ వ్యవస్థలను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో 7 రహదారుల ఏర్పాటుకు రూ.27 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే, వీర్లగుడిపాడుకు రహదారి, సంగం జాతీయ రహదారితో అనుసంధానం కోసం బీరాపేరు వాగుపై రూ.25 కోట్ల బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు లభించినట్లు చెప్పారు.
ఆత్మకూరు సమగ్రాభివృద్ధికి సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి, మరిన్ని నిధుల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
