అమరావతి మీద చంద్రబాబు అబద్దాలు: సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

April 4, 2026 7:19 PM

● హామీలు గాలికి.. వేధింపులే లక్ష్యం

● టీడీపీ వైఫల్యాలను ఎండగట్టిన వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి

అమరావతి (BNS): అమరావతి మీద చంద్రబాబు ప్రభుత్వం పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తోందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. రాజధాని మీద టీడీపీ ప్రభుత్వం మోసాలు చేస్తోందని లెక్కలతో సహా సజ్జల వివరించారు. ఈ విషయంలో మొదట నుంచీ స్పష్టత తో ఉన్నది వైసీపీ పార్టీ యేనని స్పష్టం చేశారు. కాావాలనే తెలుగుదేశం నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వివరించారు.

సూపర్ సిక్స్‌ ఏమైంది?

ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సజ్జల ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆ పథకాలకు సరిపడా నిధుల కేటాయింపు లేదని, కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలపై స్పష్టత లేదని ఆయన ఎద్దేవా చేశారు.

రాజకీయ కక్షసాధింపులే ధ్యేయం

ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోందని సజ్జల విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు.

వైయస్సార్సీపీ పోరాటం ఆపదు

జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైయస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా పగ ప్రతీకారాలు పక్కన పెట్టి, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి హితవు పలికారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media