పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల వివాదం కాస్తా ఘర్షణకు దారితీయడంతో ఇద్దరు TDP కార్యకర్తలు గాయపడ్డారు.వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని వైసీపీ కార్యకర్తలు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో గొడవ మొదలైంది.

ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు కర్రలతో టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలవ్వగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఫ్లెక్సీల ధ్వంసం వెనుక టీడీపీ హస్తం లేదని.. వైసీపీలోని అంతర్గత విభేదాల వల్లే ఒక వర్గం వారు మరో వర్గం ఫ్లెక్సీలను చింపివేసి, ఆ నెపం టీడీపీపై నెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
