పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌కు చెందిన న్యాయమూర్తులతో మాత్రమే ఈ ప్రక్రియను నిర్వహిస్తే దాదాపు 80 రోజులు పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే, త్వరగా పూర్తి చేసేందుకు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా మరియు జార్ఖండ్ నుండి న్యాయాధికారులను డెప్యుటేషన్‌పై తీసుకోవాలని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను సుప్రీంకోర్టు కోరింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఓటర్ల జాబితాపై వస్తున్న ఫిర్యాదులను, అభ్యంతరాలను పరిష్కరించడానికి జిల్లా జడ్జి లేదా అడిషనల్ జిల్లా జడ్జి స్థాయి అధికారులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా నియమించనున్నారు.ఈ మొత్తం ప్రక్రియను ఫిబ్రవరి 28 కల్లా ముగించి, తుది జాబితాను ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అనుమతి ఇచ్చింది. కేవలం బెంగాల్ జడ్జీల మీద భారం వేయకుండా, ఇతర రాష్ట్రాల జడ్జీల సాయంతో పనిని పంచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఫిర్యాదులను పరిష్కరించవచ్చని కోర్టు భావించింది.
