కుటుంబ వివాదాల కార్యక్రమంలో పాల్గొనిపిస్తామని నమ్మించి నగరానికి రప్పించిన ఇద్దరు వ్యక్తులు
మహంకాళి పోలీసులు కేసు నమోదు.. నిందితుల కోసం దర్యాప్తు
హైదరాబాద్: Secunderabad లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ వివాదాలపై ప్రసారమయ్యే ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు ఆమెను నగరానికి రప్పించి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.
మహంకాళి పోలీసుల వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 43 ఏళ్ల మహిళ కట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సమస్యలపై ప్రసారమయ్యే టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ సమయంలో ఒక వ్యక్తి తనకు కార్యక్రమ నిర్వాహకులు తెలుసని చెప్పి ఆమెను సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ప్రాంతంలోని ఓ భవనానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



