ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి. చల్లని కొండ ప్రాంతాల్లో వేడివేడి మ్యాగీ అమ్మాలన్న ఒక వినూత్న ఆలోచనతో అతను చేసిన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. చల్లటి గాలులు వీచే కొండ ప్రాంతంలో వేడి వేడి మ్యాగీ దొరికితే పర్యాటకులకు ఎంత ఇష్టమో పసిగట్టిన దేవాన్ష్, ఆ ఆలోచననే క్యాష్ చేసుకోవాలనుకున్నాడు.
కొండాకోనల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేడి వేడి మ్యాగీ తినడానికి పర్యాటకులు, హైకర్లు, మ్యాగీ లవర్స్ భారీగా తరలివచ్చారు. చూస్తుండగానే అతను తెచ్చిన స్టాక్ అంతా అమ్ముడైపోయింది. దేవాన్ష్ కేవలం ఒక్క రోజులో అక్షరాలా రూ. 24,000 సంపాదించాడు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేవలం ఒక్క రోజులో, అదీ మ్యాగీ అమ్మి ఆ స్థాయి మొత్తం సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
