పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మే 3వ తేదీన పకడ్బందీగా ప్రణాళిక వేసి ఈ ముఠా 1.5 కిలోల బంగారంతో పారిపోయింది. వివిధ ప్రాంతాలకు చెందిన నిందితులను, ప్రత్యేకంగా ఈ దోపిడీ కోసమే ఒక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. ముందుగా ప్రణాళిక వేసుకున్న ఈ దోపిడీని అమలు చేయడానికి వారు వేర్వేరుగా కరీంనగర్‌కు ప్రయాణించారు.
మహారాష్ట్రలోకి ప్రవేశించిన తర్వాత ఐదుగురు సభ్యుల ముఠా విడిపోయి, వేర్వేరు ప్రదేశాలలో తమ బంగారం వాటాలను అమ్ముకున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. నలుగురు అనుమానితులు అదుపులో ఉండగా, ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షాబుద్దీన్ పఠాన్ పరారీలో ఉన్నాడు. పఠాన్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిందితులందరినీ పట్టుకుని, సొమ్మును స్వాధీనం చేసుకున్న తర్వాత, అరెస్టులు, దొంగిలించిన బంగారం స్వాధీనంపై పూర్తి వివరాలతో కూడిన ప్రకటన చేస్తామని పోలీసులు తెలిపారు.
కరీంనగర్ నగరం నడిబొడ్డున గల జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో పట్టపగలే జరిగిన సంచలన దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. జ్యువెలరీ షాపులోకి దుండగులు తుపాకులు, మారణాయుధాలతో చొరబడి సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దోపిడీ అనంతరం దుండగులు ఆ ప్రాంతం నుండి అత్యంత వేగంగా పారిపోతున్న దృశ్యాలు, రోడ్డుపై బైక్‌లపై ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
