Shamshabad మండలంలో సుమారు 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారు. ఈ భూమి విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 166 ఎకరాలను అటవీ అభివృద్ధి సంస్థకు కేటాయించారు. మిగిలిన 9.05 ఎకరాల భూమిపై కొంతమంది సీఎస్-14 కేటగిరీగా హక్కులు క్లెయిమ్ చేస్తూ వివాదం కొనసాగుతోంది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, భూమి స్వరూపం మార్చరాదని స్టేటస్ కో ఆర్డర్ ఉంది.అయితే, తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఈ భూమిని లే-అవుట్‌గా మార్చి, ప్రీకాస్ట్ గోడలతో ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని స్థలాలను విక్రయించినట్లు కూడా బయటపడింది.రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా బుధవారం ఆపరేషన్ చేపట్టి ఆక్రమణలను తొలగించింది. అనంతరం భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు. ఈ కార్యక్రమం అధికారుల సమక్షంలో పూర్తి చేశారు.

