ఆలయానికి భక్తుడిలా వచ్చి దేవుడికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువుకట్టపై ఉన్న ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయంలో శనివారం ఈ చోరీ వెలుగుచూసింది.
నల్ల ప్యాంటు, ఎర్ర చొక్కా ధరించి, తలకు టోపీ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి.. మొదట బాబా చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేశాడు. అక్కడ ఉన్న వెండి శఠగోపానికి పదే పదే నమస్కరించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, క్షణాల్లో ఆ వెండి శఠగోపాన్ని తన వెంట తెచ్చుకున్న బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత శఠగోపం లేకపోవడాన్ని గమనించిన అర్చకులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగతనం జరిగిన తీరు చూసి అవాక్కయ్యారు.ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
