కీలక దశ కు వాంగ్ చుక్ దీక్ష.. పట్టించుకోవాలని హైకోర్టు ఆదేశం

July 16, 2026 3:57 PM
Sonam Wangchuk during hunger strike at Jantar Mantar.

18 రోజులు దాటిన నిరాహార దీక్ష.. క్షీణించిన ఆరోగ్యం
కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యా వ్యవస్థలో నెలకొన్న అవినీతి, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నిరసనగా ఆయన చేపట్టిన ఈ దీక్ష, ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుంది. వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుండటంతో ఆయన ప్రాణాలను కాపాడాలని కోరుతూ దిల్లీ హైకోర్టు కేంద్ర మరియు దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆయన జీవితాన్ని కాపాడేందుకు చేయాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

NEET పేపర్ లీక్‌లతో విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి

గత కొద్ది కాలంగా నీట్ వంటి కీలక పోటీ పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. అర్హులైన విద్యార్థులు నష్టపోవడం, పరీక్షా విధానంపై అపనమ్మకం పెరగడం వంటి పరిణామాలు విద్యా వ్యవస్థలో లోతైన కుంభకోణాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ క్రమంలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ పోరాటంలో భాగంగా, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశంలోని వివిధ నగరాలలో ఆందోళనలు చేపట్టింది. వీటికి కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులు, మేధావులు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కేతో కలిసి పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమంలోకి దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోకుండా, కేంద్రం మౌనం పాటించటంపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే వాంగ్‌చుక్ వంటి వారు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తుంటే.. కేంద్రం మొండి వైఖరితో ఉండటాన్ని అంతా తప్పు పడుతున్నారు.

వాంగ్‌చుక్ నేపథ్యం ఎంతో స్పూర్తిదాయకమైనది. లడఖ్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఆధునిక విద్యను, సాంకేతికతను సామాన్యులకు చేరువ చేసిన ఘనత ఆయనది. ‘త్రీ ఇడియట్స్’ చిత్రంలోని ఫున్సుక్ వాంగ్‌డు పాత్రకు ప్రేరణగా నిలిచిన ఆయన, తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కూడా ఆయన ముందుంటారు. 18 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ దీక్షలో ఆయన దాదాపు 8 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం.

వాంగ్‌చుక్‌కు వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశం

మానవతా దృక్పథంతో వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించి ఆయనకు తగిన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇదే డిమాండ్ తో ఢిల్లీ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు అయింది. ఒక పౌరుడు సమాజం కోసం ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు, ప్రభుత్వం మౌనంగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం.. ఇది అత్యవసరమైన అంశంగా నిర్ణయించింది. వాంగ్ చుక్ ప్రాణాలు కాపాడేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలూ చేపట్టాలని స్పష్టం గా ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటీషన్ కు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వాల స్పందన తెలియాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media