దక్షిణాఫ్రికాతో గువాహటిలో రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమవ్వడంతో, శుక్రవారం అతడిని జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
కొంతకాలంగా మెడ నొప్పితో బాధపడుతున్న గిల్, మెరుగైన చికిత్స కోసం ముంబైలో స్పెషలిస్ట్‌ను సంప్రదించనున్నాడు. తొలి టెస్టులో గాయంతో రిటైర్డ్ హర్ట్ అయిన గిల్ గైర్హాజరీతో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. అతని స్థానానికి సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ పేర్లు వినిపిస్తున్నాయి.
గిల్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి రిస్క్ తీసుకోబోమని, దీర్ఘకాల ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తామని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. సిరీస్‌లో ఇప్పటికే 1-0తో వెనుకబడిన భారత్‌కు కెప్టెన్ కోల్పోవడం మరో సవాలుగా మారింది.


