డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది రాంబాగ్ సమీపంలో శనివారం విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.
గొంది నుంచి అంతర్వేది రాంబాగ్ వస్తుండగా, బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా క్లీనర్‌కు స్టీరింగ్ అప్పగించాడు. డ్రైవింగ్ సరిగా రాని క్లీనర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉన్నారు. చెట్టు కూలిపోయేంత వేగంతో బస్సు ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే శ్రీ చైతన్య యాజమాన్యం, డ్రైవర్లకు జీతాలు మిగిల్చుకోవడానికే క్లీనర్ల చేత డ్రైవింగ్ చేయిస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.తరుచుగా స్కూల్ బస్సుల ప్రమాదాలు జరుగుతున్నా RTO అధికారులు మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
