రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం మండలం రాగోలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి దివ్యాంగులతో కలిసి రాగోలు నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో ప్రయాణించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. జిల్లాలోనే సుమారు 43 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు.సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే అన్ని బస్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాస్‌లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.ఉగాది కానుకగా ప్రారంభించిన ఈ పథకంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
