ఆరోగ్యాంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుమారు ₹11 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల కార్యాలయాల భవనాలను ఆయన మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు.

రాష్ట్రంలో 11 ఔషధ నియంత్రణ పరిపాలన (Drug Control Administration) కార్యాలయాల భవనాలను ప్రారంభించారు. శ్రీకాకుళంలో సర్వజన ఆసుపత్రి ఆవరణలో ₹92.22 లక్షల వ్యయంతో నిర్మించిన సహాయ సంచాలకుల కార్యాలయాన్ని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. గతంలో అద్దె భవనాల్లో ఉన్న ఔషధ నియంత్రణ కార్యాలయం ఇప్పుడు సొంత భవనంలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోల్ కీలకమైనదని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు.ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా, ఔషధ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ నూతన భవనాల లక్ష్యం.
