సూర్యాపేట జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం, హైదరాబాద్లో డీఎంఈ కార్యాలయంలో పనిచేస్తున్న వాణి అనే మహిళతో కలిసి నిరుద్యోగులను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
జమ్మిగడ్డకు చెందిన నాగమణి ద్వారా పరిచయాలు పెంచుకుని సుమారు 60 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. ఈ విధంగా మొత్తం రూ.1.85 కోట్లు సేకరించిన నిందితుడు ఆ డబ్బుతో ప్లాట్లు, కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
