ముఖ్యాంశాలు
- సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టులు 250
- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో దరఖాస్తు చేసుకునే అవకాశం
- అక్టోబర్ 28, 2026 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు
సుప్రీంకోర్టులో 250 JCA ఉద్యోగాలు
సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేడర్‌లో మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 28, 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి.
విద్యార్హత, వయసు
అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 1 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌లో నిమిషానికి కనీసం 35 పదాలు (35 WPM) టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు. ఇది 2026 సెప్టెంబర్ 1 నాటికి వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750 ఫీజు ఉంటుంది.
నాలుగు దశల్లో ఎంపిక
JCA పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా 131 నగరాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూను ఢిల్లీలో నిర్వహిస్తారు.
1. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్
మొదటి దశలో 100 మార్కులకు 100 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 1 గంట 30 నిమిషాలు.
- జనరల్ ఇంగ్లిష్ – 20 ప్రశ్నలు
- జనరల్ ఆప్టిట్యూడ్ – 15
- జనరల్ నాలెడ్జ్ – 15
- రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన నిబంధనలు – 15
- సుప్రీంకోర్టు రూల్స్-2013 – 10
- సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ రూల్స్-1961 – 10
- కంప్యూటర్ పరిజ్ఞానం – 15
అర్హత సాధించేందుకు కనీసం 50 మార్కులు పొందాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష మార్కుల ఆధారంగా తదుపరి దశకు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
2. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
రెండో దశలో 50 మార్కులకు 10 నిమిషాల కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌లో కనీసం 35 WPM వేగం సాధించాలి. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు కనీసం 25 మార్కులు పొందాలి.
3. డిస్క్రిప్టివ్ రాత పరీక్ష
టైపింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మూడో దశలో 100 మార్కులకు 2 గంటల పాటు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రిసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటాయి. కనీసం 50 మార్కులు సాధించాలి.
టైపింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
4. ఇంటర్వ్యూ
చివరి దశలో 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కనీసం 13 మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూకు అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పిలుస్తారు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 7, 2026
- దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2026
- ఆబ్జెక్టివ్ పరీక్ష: నవంబర్ 20, 2026 (తాత్కాలికంగా)
- ఆన్సర్ కీ, అభ్యంతరాలు: నవంబర్ 22 నుంచి 23 వరకు


