కఠినమైన UAPA (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద నమోదైన కేసుల్లోనూ “జైలు మినహాయింపు.. బెయిలే నిబంధన” అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.న్యాయమూర్తులు బీవీ నాగరత్న,ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో మాజీ JNU విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించిన తాజా తీర్పుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ తిరస్కరణలో సుప్రీంకోర్టు మూడు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన కీలక తీర్పు స్ఫూర్తిని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోందని పేర్కొంది. “బాధ్యతాయుతమైన పెద్ద బెంచ్ తీర్పులను చిన్న బెంచీలు బలహీనపరచలేవు. వాటిని పక్కన పెట్టలేవు” అని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు. బెయిల్ నిబంధన.. జైలు మినహాయింపు అని చెప్పిన మూడు న్యాయమూర్తుల బెంచ్ తీర్పును ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ పట్టించుకోలేదని తెలిపారు.NIA నమోదు చేసిన నార్కో-టెరర్ కేసులో జమ్మూకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖార్ అండ్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఇఫ్తిఖార్ అండ్రాబీ 2020 జూన్ నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించిన గుల్ఫిషా ఫాతిమా వర్సెస్ స్టేట్ తీర్పును కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కేఏ నజీబ్ కేసులో నిర్దేశించిన సూత్రాలను ఆ తీర్పులో సరిగా అమలు చేయలేదని అభిప్రాయపడింది.

ఈ ఏడాది జనవరిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్‌వీ అంజారియా ధర్మాసనం విచారణ ఆలస్యం కారణంగా ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించింది. ఆ తీర్పులో కేఏ నజీబ్ తీర్పును UAPA లోని కఠిన బెయిల్ నిబంధనలకు మాత్రమే పరిమితమైన మినహాయింపుగా చూపినట్టుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.“నజీబ్ తీర్పు ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నంపైనే మా ఆందోళన” అని జస్టిస్ భుయాన్ తీర్పు చదువుతూ అన్నారు.తీర్పు వెలువరించిన తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న కూడా “చాలా మంచి తీర్పు” అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పులు భవిష్యత్ కేసుల్లో మార్గదర్శకాలుగా పరిగణిస్తారు. వేగవంతమైన విచారణ హక్కు ముఖ్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి నిందితుడికి వేగవంతమైన విచారణ హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.UAPA కింద కేసు నమోదైందన్న కారణంతో ఆ హక్కును దెబ్బతీయలేమని తెలిపింది. “UAPAసెక్షన్ 43డీ(5)లో ఉన్న కఠిన నిబంధనలు కూడా ఆర్టికల్ 21, 22 హామీలకు లోబడే అమల్లో ఉండాలి. అందుకే UAPA కేసుల్లోనూ బెయిలే నిబంధన.. జైలు మినహాయింపు అని మేము స్పష్టంగా చెబుతున్నాం” అని ధర్మాసనం పేర్కొంది. కేఏ నజీబ్ కేసులో మూడు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పు ఇప్పటికీ చట్టబద్ధంగా అమల్లో ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. “పెద్ద బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా అనుసరించాలి. సందేహాలు ఉంటే పెద్ద బెంచ్‌కు పంపాలి. చిన్న బెంచీలు వాటిని బలహీనపరచకూడదు” అని వ్యాఖ్యానించింది.నిరవధిక జైలు శిక్షలా మారకూడదు.UAPA కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కారణంతో విచారణ పూర్తికాకుండానే నిందితులను నిరవధికంగా జైలులో ఉంచలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
“సెక్షన్ 43డీ(5) ఒక్కటే ఆధారంగా బెయిల్ నిరాకరిస్తే రాజ్యాంగబద్ధమైన వేగవంతమైన విచారణ హక్కు దెబ్బతింటుందని నజీబ్ తీర్పు ముందే హెచ్చరించింది” అని ధర్మాసనం పేర్కొంది.కుప్వారా జిల్లా హంద్వారాకు చెందిన అండ్రాబీని NIA 2020 జూన్ 11న అరెస్ట్ చేసింది. సరిహద్దుల మీదుగా హెరాయిన్ అక్రమ రవాణా చేసి, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చిన నెట్‌వర్క్‌లో ఆయన భాగమని ఆరోపించింది.NDPS చట్టం, UAPA, BNS కుట్ర సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక NIA కోర్టు, జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇప్పటికే బెయిల్ నిరాకరించాయి. ఆరోపణల తీవ్రత, విచారణ ప్రారంభ దశలో ఉందన్న కారణాలు చూపించాయి.అయితే విచారణ ముగియకుండా దీర్ఘకాలం జైలులో ఉంచడాన్ని కేవలం UAPA కఠిన నిబంధనల పేరుతో సమర్థించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

