సంతకాల అప్‌డేట్ పేరుతో అక్రమం.. కలెక్టరేట్‌లో బయటపడిన వ్యవహారం
రంగు తేడాతో అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్
Suryapet : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోసం జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పేరిట స్థానిక బ్యాంకుల్లో జాయింట్ ఖాతాలు నిర్వహిస్తుంటారు.
శాఖకు సంబంధించిన నిధులను ఈ ఖాతాల్లో జమ చేస్తారు. అవసరమైనప్పుడు అధికారులు ఆ నిధులను డ్రా చేస్తారు. అధికారులు బదిలీ అయినప్పుడు బ్యాంకు రికార్డుల్లో వారి సంతకాలను అప్‌డేట్ చేయడం సాధారణ ప్రక్రియ.
అయితే సూర్యాపేట జిల్లాలో ఇదే ప్రక్రియను ఆసరాగా చేసుకుని ఓ బ్యాంకు మేనేజర్ కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేరిట ఉన్న జాయింట్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన సంతకాల అప్‌డేట్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ రఘు ప్రసాద్ అక్రమానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సంతకం రంగులో తేడాతో బయటపడిన నిజం
సంతకాల అప్‌డేట్ పేరుతో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంతకాన్ని రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత ప్రభుత్వ ముద్ర కోసం ఫోర్జరీ చేసిన పత్రాలను తీసుకుని సూర్యాపేట కలెక్టరేట్‌కు వచ్చాడు.
అయితే కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేకమైన రంగుతో సంతకం చేస్తుంటారు.
రఘు ప్రసాద్ తీసుకొచ్చిన పత్రాల్లోని సంతకం రంగు భిన్నంగా ఉండటాన్ని కలెక్టరేట్ సహాయక సిబ్బంది గమనించారు.
దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసుల దర్యాప్తు
పత్రాలను పరిశీలించిన కలెక్టర్.. తన సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేసి కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ రఘు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.
జిల్లా పాలనాధికారి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన సూర్యాపేటలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడానికి రఘు ప్రసాద్ ఎందుకు ప్రయత్నించాడు? ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా? ఫోర్జరీ చేసిన పత్రాలను ఉపయోగించి ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



